భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..నామినేషన్ల పరిశీలనలో నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి
చిన్నచిన్న అక్షర దోషాలు, స్వల్ప పొరపాట్లతో నామినేషన్లను తిరస్కరించవద్దు
నామినేషన్ తిరస్కరణకు స్పష్టమైన కారణాలతో కూడిన స్పీకింగ్ ఆర్డర్ తప్పనిసరి
కృష్ణా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ
మచిలీపట్నం, అక్టోబర్ 23:
రెండో సాధారణ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో, నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియను ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ శ్రీ ఎం. నవీన్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం రాత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాలోని రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు (ఏఆర్వోలు)కు నామినేషన్ల పరిశీలనలో అనుసరించాల్సిన విధివిధానాలు, పాటించాల్సిన నిబంధనలపై వారు సమగ్రంగా మార్గదర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సాధ్యమైనంతవరకు నిబంధనలకు అనుగుణంగా ఉన్న అన్ని నామినేషన్లను ఆమోదించాలని సూచించారు. ఎన్నికల హ్యాండ్‌బుక్‌లోని నిబంధనలు, ముఖ్యంగా రిటర్నింగ్ అధికారుల హ్యాండ్‌బుక్‌లో పేర్కొన్న అంశాలు, తప్పనిసరిగా నెరవేర్చాల్సిన షరతులను క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. నిర్దేశిత తప్పనిసరి నిబంధనలను పాటించని నామినేషన్లను మాత్రమే నిబంధనల ప్రకారం తిరస్కరించాలని స్పష్టం చేశారు.
చిన్నపాటి పొరపాట్లతో నామినేషన్లను తిరస్కరించవద్దు
అభ్యర్థుల పేర్లలో అక్షర దోషాలు, చిన్నచిన్న పొరపాట్లు ఉన్నాయనే కారణంతో నామినేషన్లను తిరస్కరించకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఏదైనా నామినేషన్‌ను తిరస్కరించాల్సి వస్తే, ఎన్నికల హ్యాండ్‌బుక్‌లో పేర్కొన్న నిబంధనల ఆధారంగానే నిర్ణయం తీసుకోవాలని, తిరస్కరణకు గల కారణాలను స్పష్టంగా వివరిస్తూ తప్పనిసరిగా స్పీకింగ్ ఆర్డర్ జారీ చేయాలని ఆదేశించారు.
ఒకటి కంటే ఎక్కువ ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులపై ప్రత్యేక దృష్టి
ఒక అభ్యర్థి రెండు వేర్వేరు ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన సందర్భంలో, వర్తించే ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక స్థానానికి తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. నిబంధనల ప్రకారం అవసరమైన ఉపసంహరణ జరగని పక్షంలో, ఆ అభ్యర్థి అర్హతపై సంబంధిత నిబంధనల మేరకు నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

అలాగే, ఒకే ఎంపీటీసీ స్థానానికి అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ నామినేషన్ సెట్లను సమర్పించిన సందర్భంలో, వాటిలో కనీసం ఒక నామినేషన్ సెట్ నిబంధనలకు అనుగుణంగా ఉంటే, మిగిలిన సెట్ల విషయంలో నిబంధనల ప్రకారం వ్యవహరించాలని తెలిపారు. అర్హత కలిగిన నామినేషన్‌ను ఆమోదించిన తర్వాత, అభ్యర్థి తన ఇతర నామినేషన్ సెట్లను ఉపసంహరించుకోవాల్సిన అవసరం లేదని సూచించారు.
అనర్హతకు సంబంధించిన అంశాలను నిబంధనల ప్రకారం పరిశీలించాలి
పోటీ చేసే అభ్యర్థి ప్రభుత్వ సంస్థలో నామినేటెడ్ పోస్టులో కొనసాగుతున్న సందర్భంలో, సంబంధిత చట్టాలు, ఎన్నికల నిబంధనల ప్రకారం ఆ పదవికి రాజీనామా చేసి, దానిని తప్పనిసరిగా ఆమోదింపజేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
నామినేషన్ల పరిశీలనలో ప్రతి అంశాన్ని నిబంధనల ఆధారంగా క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అధికారులకు సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీవో, జడ్పీ సీఈఓ, సంబంధిత రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.
జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, కృష్ణా జిల్లా, మచిలీపట్నం వారిచే జారీ చేయబడినది.