ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా పాటించాలి

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా పాటించాలి
– జిల్లాలోని పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీస్‌ 30 యాక్ట్‌ అమలు
– శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది ఉండదు
– ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినట్లు తెలిస్తే చట్టపరమైన చర్యలు
– పోలింగ్‌కు 48 గంటలకు ముందే సభలు, సమావేశాలు నిషేధం
– ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగిసేందుకు సహకరించాలి
– విలేఖరుల సమావేశంలో జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్‌నాయుడు

క్రైమ్ న్యూస్ కృష్ణా :

జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అన్ని రాజకీయపార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్ధులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా పాటించాలని జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్‌నాయుడు తెలిపారు. అందుకు విరుద్దంగా వ్యవహరిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. శుక్రవారం ఆయన తన ఛాంబర్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 14వ తేదీ నుంచి కోడ్‌ను అమలులోకి తెచ్చిందన్నారు. ఈ నేపధ్యంలో ఎన్నికలు ప్ర«శాంత వాతావరణంలో పారదర్శకంగా జరిగేందుకు అన్ని రాజకీయపార్టీలు సహకరించాలని కోరారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీస్‌ 30 యాక్ట్‌ అమలులో ఉన్నందున అభ్యర్ధులు, వారి అనుచరులు గుంపులుగా సమీకరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 30 యాక్ట్‌ అమలులో ఉన్నందున నామినేషన్‌లు వేసేందుకు అభ్యర్ధితో పాటు మరో ఇద్దరు మాత్రమే లోనికి అనుమతించటం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. అలాగే రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రజల్లో విభేదాలను రెచ్చగొట్టటం, పరస్పర ద్వేష భావాలు కలిగేలా వ్యవహరించటం వంటివి చేయకూడదని హితవు పలికారు. కులాలు, మతాల మద్య విభేదాలు సృష్టించే కార్యక్రమాలు తలపెట్టకూడదన్నారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలు వంటి ప్రార్థనా మందిరాలను ఎన్నికల ప్రచార వేదికలుగా ఉపయోగించకూడదని తెలిపారు. లిఖితపూర్వక అనుమతులు పొందకుండా ప్రభుత్వ, ప్రైవేటు భవనాలపై పార్టీ జెండాలు కట్టడం, పోస్టర్లు అతికించడం, నినాదాలు రాయడం వంటి చర్యలకు పూనుకోకూడదని చెప్పారు. ఇతర రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఏర్పాటు చేసిన జెండాలు, పోస్టర్లను తొలగించడం, ధ్వంసం చేయడం వంటివి చేస్తే చర్యలు తప్పవన్నారు.

ఎన్నికల చట్టం – నిషేధిత కార్యకలాపాలు ః

కులం, మతం, వర్గం పేరుతో ఓట్లు అభ్యర్ధించకూడదన్నారు. అలాగే ఇతర పార్టీలకు ఓట్లు వేయవద్దని చెప్పటం చేయకూడదన్నారు. పోస్టర్‌లు ముద్రించిన ప్రచురణకర్తల పేర్లు, చిరునామాలు లేకుండా పోస్టర్లు, కరపత్రాలు, పాంప్లేట్లుతో పాటు ఇతరత్రా ప్రకటనలను ముద్రిం^è కూడదన్నారు. ఇతర రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసిన ఎన్నికల సమావేశాలకు ఆటంకం కలిగించకూడదన్నారు. ఓటర్లకు నగదు, బహుమతులు, లంచాల రూపంలో ప్రలోభాలకు గురి చేస్తూ పట్టుబడితే చర్యలు తీసుకోవటం తధ్యమన్నారు. పోలింగ్‌ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఓట్లు కోసం ప్రచారం చేయకూడదని చెప్పారు. ముఖ్యంగా ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల విధులకు ఎటువంటి ఆటంకం కలిగించకూడదని అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజకీయ పార్టీలు, నాయకుల దిష్టిబొమ్మలను ఊరేగించడం, తగులబెట్టడం వంటి చర్యలకు పూనుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.

సభలు, సమావేశాలు నిషేధo ః

జిల్లాలో ఎన్నికలకు సంబంధించి రెండు రోజులు (48 గంటలు) ముందు నుంచే సభలు, సమావేశాలను ముగించాల్సి ఉంటుందన్నారు. అందుకు విరుద్దంగా ఎక్కడైనా సభలు, సమావేశాలు, ఊరేగింపులు తలపెట్టినట్లైతే పోలీసు చర్యలు తప్పవన్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 48 గంటల ముందు నుంచే కార్యక్రమాలు నిలిపివేయాలని చెప్పారు. జిల్లా ప్రజా పరిషత్తులు, మండల ప్రజా పరిషత్తుల ఎన్నికలకు సంబంధించి 48 గంటలలు, గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలింగ్‌ ముగియడానికి 44 గంటల ముందు నుంచే అన్ని కార్యక్రమాలను ఆపేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసే తాజా ఉత్తర్వులు, నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలని తెలిపారు.

అనుమతులు తప్పనిసరి ః

ఎన్నికలకు సంబంధించి నిర్వహించుకునే బహిరంగ సభలు, సమావేశాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అవసరమైన అనుమతులు పొందకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. అలాగే అనుమతి లేకుండా లౌడ్‌స్పీకర్లను ఉపయోగించినా చర్యలు ఉంటాయన్నారు. అనుమతి పొందిన బహిరంగ సమావేశాలు, రోడ్‌షోల వద్ద లౌడ్‌స్పీకర్ల వినియోగ సమయాలు, ఇతర సందర్భాల్లో వర్తించే సమయ పరిమితులను సంబంధిత అధికారిక ఉత్తర్వుల ప్రకారం పాటించాలని సూచించారు.