10 నెలల ప్రత్యేక శిక్షణ పూర్తి చేసుకున్న నూతన పోలీస్ డాగ్ “రీటా”

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..10 నెలల ప్రత్యేక శిక్షణ పూర్తి చేసుకున్న నూతన పోలీస్ డాగ్ “రీటా”

నార్కోటిక్ పదార్థాల గుర్తింపు, ట్రాకింగ్‌లో సేవలకు సిద్ధం – జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్.,

క్రైమ్ న్యూస్ కృష్ణా :

కృష్ణా జిల్లా పోలీస్ శాఖకు చెందిన “రీటా” అనే ఫీమేల్ బెల్జియన్ మాలినోయిస్ పోలీస్ డాగ్ 10 నెలల ప్రత్యేక శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని జిల్లాకు చేరుకున్న సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ గారు రీటాను, దాని హ్యాండ్లర్ HC 1451-టి. భూషయ్య, ను అభినందించారు.

మంగళగిరి సీటీసీ లో Narcotic Detection & Tracking విభాగంలో ప్రత్యేక శిక్షణ పొందిన రీటా, నార్కోటిక్ పదార్థాలు, అనుమానాస్పద పదార్థాలను గుర్తించడం, వాటి ఆనవాళ్లను అనుసరించడం వంటి విధుల్లో పోలీసులకు సహాయకారిగా వ్యవహరించనుంది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు రీటాకు అందించిన శిక్షణ, దాని సామర్థ్యాలు, విధుల్లో వినియోగించే విధానం తదితర వివరాలను హ్యాండ్లర్‌ను అడిగి తెలుసుకున్నారు. నార్కోటిక్ నేరాల నియంత్రణలో పోలీస్ డాగ్ సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు.

రీటా ఆరోగ్యం, ఆహారం, విశ్రాంతి మరియు సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, శిక్షణ ద్వారా సాధించిన సామర్థ్యాలను విధుల్లో సమర్థవంతంగా వినియోగించేలా నిరంతరం పర్యవేక్షించాలని హ్యాండ్లర్‌కు సూచించారు.

ఎస్పీ గారు మాట్లాడుతూ

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టడంలో ప్రత్యేక శిక్షణ పొందిన పోలీస్ డాగ్స్ సేవలు ఎంతో కీలకం. నార్కోటిక్ పదార్థాల గుర్తింపు, ట్రాకింగ్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన రీటా సేవలను జిల్లాలో సమర్థవంతంగా వినియోగించుకుంటాం. పోలీస్ డాగ్ ఆరోగ్యం, సంరక్షణ విషయంలో హ్యాండ్లర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నార్కోటిక్ నేరాల నియంత్రణకు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది మరియు పోలీస్ డాగ్‌ల సేవలను సమన్వయంతో వినియోగించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీ వివి నాయుడు గారు, ఇతర పోలీస్ అధికారులు మరియు కృష్ణా జిల్లా ఈగల్ టీమ్ సిబ్బంది పాల్గొన్నారు.