భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..9 నెలల శిక్షణ పూర్తి చేసుకొని జిల్లాకు కేటాయించబడిన 136 మంది ప్రొబేషనరీ కానిస్టేబుళ్లకు దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్.,
క్రమశిక్షణ, ప్రజల పట్ల మర్యాద, విధి నిర్వహణలో నిబద్ధతే పోలీస్ శాఖకు ప్రధాన బలం – జిల్లా ఎస్పీ
క్రైమ్ న్యూస్ కృష్ణా :
కృష్ణా జిల్లాకు 9 నెలల ప్రాథమిక పోలీస్ శిక్షణ పూర్తి చేసుకొని కేటాయించబడిన 136 మంది ప్రొబేషనరీ కానిస్టేబుళ్లకు( 40 మంది మహిళలు, 96 మంది పురుషులు) జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ గారు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) శ్రీ వి.వి. నాయుడు గారితో కలిసి దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా శిక్షణ కాలంలో కానిస్టేబుళ్లు నేర్చుకున్న చట్టాలు, పోలీస్ విధులు, డ్రిల్, ఆయుధ వినియోగం, నేర దర్యాప్తు, శాంతిభద్రతల నిర్వహణ, సైబర్ నేరాలపై అవగాహన తదితర అంశాలను ఎస్పీ గారు అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో వారు ఎదుర్కొనే పరిస్థితులు, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే విధానాలపై వారికి పలు సూచనలు చేశారు.
ఎస్పీ గారు మాట్లాడుతూ..
పోలీస్ శాఖలోకి అడుగుపెట్టిన నాటి నుంచే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావం, బాధ్యతాయుత ప్రవర్తనతో విధులు నిర్వహిస్తూ పరిపూర్ణ పోలీస్ సిబ్బందిగా ఎదగాలని సూచించారు. పోలీస్ సిబ్బంది వ్యవహరించే తీరు, ప్రజలతో మాట్లాడే విధానం, విధి నిర్వహణలో చూపించే నిబద్ధత ద్వారా పోలీస్ శాఖపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని తెలిపారు.
శిక్షణ కాలంలో నేర్చుకున్న ప్రతి అంశాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేస్తూ, నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవాలని సూచించారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సైబర్ నేరాలు, ఐటీ సంబంధిత నేరాలపై ప్రాథమిక అవగాహనతో పాటు వాటి నియంత్రణ, దర్యాప్తు విధానాలపై నిరంతరం పరిజ్ఞానం పెంపొందించుకోవాలని తెలిపారు.
పోలీసుల విధుల్లో ప్రజా సంబంధాలు అత్యంత కీలకమని, పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్కరితో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను సానుభూతితో విని చట్టపరిధిలో పరిష్కరించే దిశగా పనిచేయాలని సూచించారు. బాధితులకు భరోసా కల్పిస్తూ, న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించడం ప్రతి పోలీస్ సిబ్బంది బాధ్యత అని పేర్కొన్నారు.
అదేవిధంగా విధి నిర్వహణలో చట్టపరమైన పరిజ్ఞానం, సమయస్ఫూర్తి, పరిస్థితులను అంచనా వేసే సామర్థ్యం, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో కానిస్టేబుళ్ల పాత్ర అత్యంత కీలకమని, తమకు అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో నిర్వహించాలని తెలిపారు.
పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరించడం, విధుల్లో నిర్లక్ష్యం, క్రమశిక్షణా రాహిత్యం లేదా చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడటం ఏమాత్రం సహించేది లేదని, అటువంటి ప్రవర్తనకు పాల్పడే వారిపై శాఖాపరమైన మరియు చట్టపరమైన నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

యూనిఫాం కేవలం ఉద్యోగానికి గుర్తు కాదు.. ప్రజల భద్రత కోసం మనపై ఉంచిన బాధ్యతకు ప్రతీక. ప్రజల విశ్వాసాన్ని కాపాడుతూ, నిజాయితీ, క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వహించి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని గారు సూచించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.