కదంతొక్కిన యువజనంజంతర్‌‌మంతర్‌లో ఉద్రిక్తత

భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ….కదంతొక్కిన యువజనం
జంతర్‌‌మంతర్‌లో ఉద్రిక్తత

  • డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ భారీ ప్రదర్శన
  • ఆందోళనకారుల్ని అడ్డుకున్న ఢిల్లీ పోలీసులు
  • సీఈసీ రాజీనామా, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్‌
  • సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ, బృందా కరత్‌, ఎంపీ ఏఏ రహీం సహా
  • పలువురి అరెస్టు.. తీవ్ర నిర్బంధం విధించిన మోడీ సర్కార్‌

కేంద్రంలోని మోడీ ప్రభుత్వ ఆంక్షలు, ఢిల్లీ పోలీసుల నిర్బంధాలను ఛేదించి యువజనం కదంతొక్కింది. యువతకు ఉపాధి కల్పించడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూనే, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో జరిగిన అక్రమాలు, లక్షలాది ఓట్ల తొలగింపునరకు బాధ్యుడైన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్‌‌మంతర్‌ ‌వద్ద శుక్రవారం భారీ ఆందోళన నిర్వహించారు.

ప్రజలు దానిలో భాగస్వాములు కాకుండా ఉండేందుకు మోడీ ప్రభుత్వం తీవ్ర నిర్భంధాలు విధించింది. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆందోళన కారుల ప్రదర్శనను అడ్డుకొని వందలాదిమందిని అరెస్టులు చేశారు. ఈ నేపథ్యంలో జంతర్‌‌మంతర్‌ ‌వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.

డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నేతలతో పాటు ఆందోళనకు సంఘీభావం తెలుపుతూ ప్రదర్శనలో పాల్గొన్న సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎమ్‌ఏ బేబీ, ఆపార్టీ సీనియర్‌ ‌నాయకురాలు బృందాకరత్‌, ఎంపీ ఏఏ రహీం సహా పలువురిని పోలీసులు బలవంతంగా అరెస్టులు చేశారు.

ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో పలువురు గాయపడ్డారు. డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ పిలుపునకు స్పందించి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది యువత శుక్రవారం తెల్లవారుజామునే ఢిల్లీకి చేరుకున్నారు. కేరళం, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, కర్నాటక, త‌మిళ‌నాడు, హ‌ర్యానా, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌, పంజాబ్‌, రాజ‌స్తాన్‌ త‌దిత‌ర రాష్ట్రాల‌ నుంచి వందలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు. ‌

ఆందోళ‌న‌కు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఈ ప్రదర్శన అఖిల భారత కిసాన్‌ సభ కార్యాలయం నుంచి జంతర్‌మంతర్‌ వరకు మూడు బృందాలుగా సాగింది. మ‌హాత్మా గాంధీ, భగత్‌సింగ్‌, అంబేద్కర్‌ చిత్రాలను చేతబూని ముందుకు సాగిన యువత హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, ఇంగ్లీష్‌ తదితర భాషల్లో నినాదాలు చేశారు.

ఉద్యోగాలు కల్పించకుండా నిరుద్యోగాన్ని పెంచుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తారు. దీంతో పోలీసులు వారిపై తీవ్ర నిర్బంధానికి దిగారు. జంతర్‌ మంతర్‌కి వెళ్లే మార్గాలన్నీ మూసి వేశారు. జంత‌ర్‌ మంత‌ర్ మార్గంలో ఎనిమిది అంచెల బారికేడ్ల‌ను ఏర్పాటు చేశారు.

వేలాది మంది ఢిల్లీ పోలీసులు, రాపిడ్ యాక్ష‌న్ ఫోర్స్ (ఆర్ఎఎఫ్‌) బ‌ల‌గాలు మోహ‌రిం చాయి. బిఎన్ఎస్ఎస్ సెక్ష‌న్ 163 కింద నిషేధాజ్ఞ‌లు అమ‌ల్లోకి తీసుకొచ్చారు. జ‌న్‌ప‌థ్, ప‌టేల్ చౌక్‌, సెంట్ర‌ల్ సెక్ర‌టేరియ‌ట్‌, రాజీవ్ చౌక్‌, సేవా తీర్థ్‌, మండీ హౌస్‌, లోక్ క‌ల్యాణ్ మార్గ్ , ఐఎన్ఎ, చోర్ బ‌జార్‌, రామ‌కృష్ణ ఆశ్రం మార్గ్‌, న్యూఢిల్లీ త‌దిత‌ర‌ 11 మెట్రో స్టేషన్లను మూసివేశారు. జంత‌ర్ మంత‌ర్‌తోపాటు న్యూఢిల్లీలోని ప‌లు ప్రాంతాల్లో ఇంట‌ర్నెట్ సేవ‌ల్ని నిలిపివేశారు.

దీంతో పాటు యాప్ బుకింగ్ ఊబ‌ర్‌, ఓలా, భార‌త్ టాక్సీ, ఫోన్ పే, గూగుల్ పే సేవ‌లు ఆగిపోయాయి. ఆందోళనకారులను తరలించేందుకు 70 పోలీసు బస్సులను రంగంలోకి దించారు. . యువకులను ఈడ్చుకెళ్లి అరెస్టులు చేశారు. పోలీసు అధికారి ఓ యువకుడి ముఖంపై కొడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వెలుగుచూశాయి.

ఈ దాడిలో డీవైఎఫ్‌ఐ కేరళం రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే ఎం. విజిన్‌ చేయి విరిగింది. రెండు గంటలకు పైగా సాగిన అరెస్టుల పర్వంలో దాదాపు వెయ్యి మంది నాయకులు, కార్యకర్తలను బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. అరెస్టు చేసిన నేత‌లు, కార్య‌కర్త‌ల్లో కొంత మందిని వివిధ ప్రాంతాల్లో తిప్పుకుంటూ ఢిల్లీ స‌రిహ‌ద్దు ప్రాంతాల‌కు త‌రలించారు.

అయినా… ఆగని పోరు
ఈ ఆందోళనలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ, సీనియర్‌ ‌నాయకురాలు బృందాకరత్‌, డీవైఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షులు, రాజ్యసభ ఎంపీ ఎఎ రహీం, ప్రధాన కార్యదర్శి హిమాగ్నరాజ్‌ భట్టాచార్య, డీవైఎఫ్‌ఐ అఖిల భారత కోశాధికారి సంజీవ్‌ కుమార్‌, ఉపాధ్యక్షులు వి. వసీఫ్‌, జైక్‌ సి. థామస్‌, ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షులు ఆదర్శ్‌ ఎం. సాజి, ప్రధాన కార్యదర్శి శ్రీజన్‌ భట్టాచార్య, ఐషీ ఘోష్‌, శిల్పా సురేంద్రన్‌, ఎం. విజిన్‌ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.