అమరావతి నుంచి హైదరాబాద్ జస్ట్ 70 నిమిషాల్లో వెళ్లొచ్చు.. రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన

భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి..అమరావతి నుంచి హైదరాబాద్ జస్ట్ 70 నిమిషాల్లో వెళ్లొచ్చు.. రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన

Ammiraju Udaya Shankar.sharma News Editor…రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన రైల్వే ప్రాజెక్టులు, బుల్లెట్ రైలుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి కేంద్రం భారీగా ప్రాజెక్టుల్ని మంజూరు చేసిందని గుర్తు చేశారు.
దేశవ్యాప్తంగా బుల్లెట్ రైలు ప్రాజెక్టులకు సంబంధించి హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో నిర్వహించిన కార్యక్రమంలో అశ్వినీ వైష్ణవ్‌ కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ మీదుగా హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులకు (హైదారాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు) బుల్లెట్‌ ట్రైన్లు రాబోతున్నాయని తెలిపారు. ఈ బుల్లెట్ హైదరాబాద్‌ నుంచి అమరావతికి 70 నిమిషాల్లో వెళ్లొచ్చన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 2.35 గంటలు, పుణేకు 123 నిమిషాలు, చెన్నైకు 3 గంటల్లోనే చేరుకోవచ్చన్నారు. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు, చెన్నై, పుణే నగరాలకు బుల్లెట్‌ రైళ్లు రాబోతున్నాయని తెలిపారు.

హైదరాబాద్‌-అమరావతి-చెన్నై హైస్పీడ్‌ బుల్లెట్ రైల్‌ కారిడార్‌ గురించి గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజధాని అమరావతి మీదుగానే వెళ్లేలా కేంద్రం ప్లాన్ చేసింది. అమరావతికి సమీంలోనే రైల్‌ కారిడార్‌ ఎలైన్‌మెంట్‌ ఉండాలని చంద్రబాబు కూడా సూచించారు. మొత్తం 760.09 కిలోమీటర్ల కారిడార్‌లో 18 స్టేషన్లు ప్లాన్ చేశారు. తెలంగాణలో 180.32 కిలోమీటర్లు, ఏపీలో 518.54 కిలోమీటర్లు ఉంటుంది. ఏపీలోని పల్నాడు జిల్లా దాచేపల్లి మొదటి స్టేషన్‌ కాగా.. అక్కడి నుంచి అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, తిరుపతి స్టేషన్లు ప్లాన్ చేశారు. అటు హైదరాబాద్ టు బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్‌ కూడా ఏపీ మీదుగా వెళుతుంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి యూపీఏ ప్రభుత్వం రైల్వే బడ్జెట్‌లో కేవలం రూ.880 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు అశ్విని వైష్ణవ్. ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం ఒక్క తెలంగాణకే రూ.5వేల కోట్లు రైల్వే ప్రాజెక్టుల కోసం ఖర్చు చేస్తోందన్నారు. తెలంగాణలో కీలకమైన సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను ఆధునికంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా అమృత్ భారత్ కింద మొత్తం 1,300 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులు చేపట్టామన్నారు.. ఇప్పటికే 260 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పూర్తయ్యిందన్నారు. తెలంగాణలో 40 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణకు నిధులు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

కేంద్రం వికసిత భారత్‌-2047 దిశగా ముందుకు సాగుతోందని.. ఈ కలను నిజం చేయడంలో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు అశ్విని వైష్ణవ్. దేశవ్యాప్తంగా సాంకేతిక రంగం సరికొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతోందన్నారు. ఐటీతో పాటుగా సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్‌ తయారీ, రైల్వే రంగాలలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయన్నారు. ప్రస్తుతం ముంబై-అహ్మదాబాద్‌ మధ్య మొదటి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. మొత్తం 7 బుల్లెట్ రైలు కారిడార్లలో హైదరాబాద్‌కు మూడు దక్కాయన్నారు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్.