భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం..ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపులో నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి
కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్త వహించాలి

– –జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
మచిలీపట్నం: నవంబర్ 06, 2026
కృష్ణా జిల్లాలో శనివారం నిర్వహించనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు.
శుక్రవారం రాత్రి మచిలీపట్నంలోని తన క్యాంపు కార్యాలయం నుంచి రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ప్రత్యేక అధికారులు, మాస్టర్ ట్రైనర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు, అనుసరించాల్సిన విధివిధానాలపై పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, సహాయ కలెక్టర్ నమ్రత అగర్వాల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన అంశాలను వివరించారు. స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ టేబుళ్ల వద్దకు తరలించే విధానం, బ్యాలెట్ పేపర్ల విభజన, ప్రారంభ లెక్కింపు, అభ్యర్థుల వారీగా వివరమైన లెక్కింపు, ఫలితాల నమోదు తదితర అంశాలపై అధికారులకు అవగాహన కల్పించారు.
కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుందని, ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి కౌంటింగ్ టేబుల్‌పై పోస్టల్ బ్యాలెట్, ప్రారంభ లెక్కింపు, ఎంపీటీసీ, జడ్పీటీసీ వివరాల నమోదు కోసం అవసరమైన రిజల్ట్ షీట్లు, డిక్లరేషన్ ఫారాలు అందుబాటులో ఉంచాలన్నారు. బ్యాలెట్ పేపర్ల విభజన కోసం పింక్, వైట్ ట్రేలను, అభ్యర్థుల వారీగా బ్యాలెట్లను వేరు చేసేందుకు అవసరమైన ట్రేలను ప్రతి టేబుల్‌పై సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ బ్యాలెట్ బాక్సుల కోసం ప్రత్యేక డ్రమ్‌లు, రబ్బర్ బ్యాండ్లు, పేపర్ వైట్లు, తిరస్కరణ స్టాంపులు, ప్లేట్లు, స్టేషనరీ, పెన్నులు, ప్యాడ్లు, కాలిక్యులేటర్లు తదితర సామగ్రిని ముందుగానే ఏర్పాటు చేసుకోవాలన్నారు. చెల్లని ఓట్లను తిరస్కరించే సమయంలో అందుకు గల కారణాలను నిబంధనల ప్రకారం స్పష్టంగా నమోదు చేయాలని, ఈ విషయంలో కౌంటింగ్ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రతి టేబుల్‌కు ప్రారంభ లెక్కింపు, వివరమైన లెక్కింపు ప్రక్రియలకు అనుగుణంగా నేమ్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
కౌంటింగ్ హాళ్లలో టేబుల్ నంబర్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ప్రింటర్, ప్రత్యేక ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, మీడియా పాయింట్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. కౌంటింగ్ సిబ్బందికి, విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా గుర్తింపు కార్డులు జారీ చేయాలని, ఐడీ కార్డులు లేని వారిని పోలీసు సిబ్బంది అనుమతించరని స్పష్టం చేశారు. ప్రతి కౌంటింగ్ హాల్‌కు ఇద్దరు మాస్టర్ ట్రైనర్లను కేటాయించామని, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, రిజర్వ్ సిబ్బంది సహా అందరికీ గుర్తింపు కార్డులు అందేలా చూడాలన్నారు.
కౌంటింగ్ కేంద్రాల్లో సిబ్బందికి అవసరమైన ఆహారం, టీ, తాగునీటి సౌకర్యాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని సూచించారు. సిబ్బందికి నిర్ణీత సమయాల్లో బిస్కెట్లు, స్నాక్స్ వంటి అల్పాహారాన్ని అందుబాటులో ఉంచాలని, అవసరమైన మేరకు సహాయక సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.
ప్రతి కౌంటింగ్ సెగ్మెంట్‌కు అవసరమైన దానికంటే రెట్టింపు సంఖ్యలో టేబుళ్లను సిద్ధం చేసుకోవాలని, ఒక్కో గదిలో సగం టేబుళ్లు ఏర్పాటు చేసి, రెండు పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను ఒకే గదిలో ఉంచే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు చెందిన అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో ఒక్కొక్క బ్యాలెట్ బాక్సును క్రమపద్ధతిలో తెరిచి లెక్కింపు చేపట్టాలని, అన్ని బ్యాలెట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు సంబంధిత ఏజెంట్లు అక్కడే ఉండేలా చూడాలన్నారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపును ఒకేసారి సమాంతరంగా నిర్వహించాలని, ఒక గదిలోని బ్యాలెట్ పేపర్లను మరొక గదికి తరలించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అన్ని టేబుళ్ల వద్ద మొదట ప్రారంభ లెక్కింపు ప్రక్రియను పూర్తిచేసిన అనంతరం మాత్రమే అభ్యర్థుల వారీగా వివరమైన లెక్కింపు చేపట్టాలని, ప్రారంభ లెక్కింపు సమయంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఏజెంట్లు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.
ప్రతి కౌంటింగ్ కేంద్రంలో మీడియా కోసం ప్రత్యేక గదిని కేటాయించి, టీవీ లేదా స్క్రీన్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కౌంటింగ్ ఫలితాలను ఎప్పటికప్పుడు మీడియాకు అందుబాటులో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.