బంగారు ఆభరణాలు చోరీ చేసిన వ్యక్తి అరెస్ట్

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..జగిత్యాల జిల్లా…

బంగారు ఆభరణాలు చోరీ చేసిన వ్యక్తి అరెస్ట్

స్నేహితుడి ఇంట్లోనే చోరీ, సుమారు 8 తులాల బంగారు ఆభరణాలు చోరీ, మణప్పురం గోల్డ్ లోన్స్‌లో మూడు విడతలుగా తాకట్టు పెట్టిన నిందితుడు*

మెట్‌పల్లి పట్టణంలోని రెడ్డి కాలనీకి చెందిన తలారి లావణ్య ఇంట్లో బీరువాలో భద్రపరిచిన సుమారు 8 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేసిన కేసులో నిందితుడు ఇందూరి నవీన్ (26)ను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్టు మెట్ పల్లి ఎస్సై పబ్బ కిరణ్ కుమార్ తెలిపారు

తేదీ 14-10-2026న తలారి లావణ్య తన ఇంటి బీరువాలోని లాకర్‌లో భద్రపరిచిన బంగారు పెద్ద గొలుసు (4.5 తులాలు), నగల నెక్లెస్ (2 తులాలు), బంగారు కమ్మలు, బుట్టలు (0.5 తులాలు), ఉంగరం (0.5 తులాలు), బంగారు మాటీలు (0.5 తులాలు) మొత్తం సుమారు 8 తులాల బంగారు ఆభరణాలు గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించినట్లు మెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా బాధితురాలి కుమారుడు అభినవ్ స్నేహితుడైన చైతన్య నగర్‌కు చెందిన ఇందూరి నవీన్‌పై అనుమానం వ్యక్తం కావడంతో పోలీసులు అతనిపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో నవంబర్ 6వ తేదీ ఉదయం అతని ఇంటి వద్ద అదుపులోకి తీసుకొని విచారించగా, తానే చోరీకి పాల్పడినట్లు అంగీకరించాడు.

నిందితుడు తరచూ తన స్నేహితుడు అభినవ్ ఇంటికి వెళ్లే క్రమంలో ఇంట్లోని బీరువాలో బంగారు ఆభరణాలు ఉన్నట్లు గమనించి, సులభంగా డబ్బు సంపాదించి విలాసాలకు ఖర్చు చేయాలనే ఉద్దేశంతో చోరీకి పథకం వేసినట్లు విచారణలో వెల్లడించాడు. ఈ క్రమంలో అక్టోబర్ 3వ తేదీన మధ్యాహ్నం అభినవ్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో బీరువాలోని బంగారు ఆభరణాలను చోరీ చేసి, మణప్పురం గోల్డ్ లోన్స్, మెట్‌పల్లిలో ఒకేసారి తాకట్టు పెడితే అనుమానం వస్తుందని భావించి మూడు విడతలుగా తాకట్టు పెట్టినట్లు తెలిపాడు. వచ్చిన డబ్బులతో తన అప్పులు తీర్చి, మిగిలిన మొత్తాన్ని హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లి విలాసాలకు ఖర్చు చేసినట్లు అంగీకరించాడు.

నిందితుడి నుంచి బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టేందుకు ఉపయోగించిన సెల్‌ఫోన్‌తో పాటు మణప్పురం గోల్డ్ లోన్స్‌లో తాకట్టు పెట్టిన బంగారానికి సంబంధించిన రసీదులు, స్టేట్‌మెంట్లను ఇద్దరు పంచుల సమక్షంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.