భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..రహదారి పక్కన మాంసం దుకాణాల్లో ‘మందు సిట్టింగ్’లపై మల్దకల్ పోలీసుల తనిఖీలు..
జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో రహదారి పక్కన ఉన్న మాంసం దుకాణాల్లో మందు సిట్టింగ్లపై పోలీసులు ఆదివారం ముమ్మర తనిఖీలు నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మల్దకల్ పోలీస్ సిబ్బంది మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వెంబడి ఉన్న చికెన్, మటన్ దుకాణాలను, వాటి అనుబంధ గదులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
దుకాణాల ప్రాంగణంలో కస్టమర్లకు మద్యం సేవించేందుకు స్థలం కేటాయించకూడదని నిర్వాహకులకు స్పష్టం చేశారు. రహదారుల పక్కన మద్యం సేవించడం వల్ల దారిపొడవునా వెళ్లే ప్రయాణికులకు, ముఖ్యంగా మహిళలకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
నిబంధనలు మీరి చట్టవిరుద్ధంగా మద్యం సిట్టింగ్లు ఏర్పాటు చేసే దుకాణదారులపై, అక్కడ మద్యం సేవించే వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.