భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..పురపోరు.. నవంబరు 1న.. 3న ఓట్ల లెక్కింపు
సవరించిన షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్…4 పట్టణ స్థానిక సంస్థల్లో నామినేషన్ల స్వీకరణ గడువు పొడిగింపు
ముందే వాయిదా పడిన మైదుకూరు పురపాలక సంఘంలో 32 వార్డులకూ..సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో.. మరో 3 పట్టణ స్థానిక సంస్థల్లో 40 స్థానాలకు అవకాశం
అక్కడి కలెక్టరేట్లలోనూ నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు…
అమరావతి: రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సవరించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం రాత్రి విడుదల చేసింది. తాజా షెడ్యూలు ప్రకారం 13 నగరపాలక సంస్థలు, 87 పురపాలక సంఘాలు/ నగర పంచాయతీలకు నవంబరు 1న పోలింగ్ జరగనుంది. అవసరమైన చోట్ల 2న రీపోలింగ్ నిర్వహించి 3న ఓట్లు లెక్కించనున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ వాయిదా పడిన మైదుకూరు పురపాలక సంఘంలో అన్ని(32) వార్డులతో పాటు సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాజంపేట పురపాలక సంఘంలోని 11 వార్డులకు నామినేషన్ దాఖలు సమయాన్ని పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.
వీటితో పాటు కడప కార్పొరేషన్‌లోని 11, తిరుపతిలోని 18 డివిజన్లకు కూడా కొత్తగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని ఎస్ఈసీ పేర్కొంది. మొత్తంగా 72 వార్డులు/ డివిజన్లకు నామినేషన్లు స్వీకరిస్తారు. పోటీకి సిద్ధపడిన అభ్యర్థుల్ని బెదిరించడం, దాడి చేయడం, నామినేషన్ పత్రాలు చించివేయడం తదితర ఘటనల నేపథ్యంలో కొందరు నామినేషన్ వేయలేకపోయినట్లు గుర్తించామని, వారికి పోటీచేసే అవకాశాన్ని కల్పించేందుకు నామినేషన్ల గడువును పొడిగిస్తున్నట్లు తెలిపింది. 23, 24 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ, 25న ఉదయం నామినేషన్ల పరిశీలన, అదేరోజు ఉపసంహరణకు గడువుగా నిర్ణయిస్తూ గురువారం సవరించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.

తొలివిడతలో 13 నగరపాలక సంస్థలు, 87 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరించడంతో పాటు 21న మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణలకు అనుమతించింది. అయితే, తమ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారంటూ వైకాపా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. అభ్యర్థుల తుది జాబితా ప్రచురణను ఈ నెల 25 వరకు వాయిదా వేయాలని ఆదేశించింది. పిటిషనర్ పార్టీ, అభ్యర్థులు సమర్పించిన వినతుల్ని, సాక్ష్యాలు, ఎలక్ట్రానిక్ ఆధారాలు పరిశీలించాలని ఆదేశించింది. శాంతిభద్రతల సమస్యల కారణంగా నామినేషన్లు వేయలేకపోయారని భావిస్తే.. వారికి అవకాశం కల్పించాలని, నామినేషన్ల దాఖలుకు గడువు పొడిగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. 22వ తేదీలోగా కమిషన్ తన నిర్ణయాన్ని ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నామినేషన్‌కు గడువు పొడిగించాలని నిర్ణయిస్తే.. అక్కడ నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ నుంచి కనీసం 48 గంటలకు తక్కువ కాకుండా గడువు ఇవ్వాలని నిర్దేశించింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 100 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు కమిషన్ బుధవారం రాత్రి ప్రకటించింది. అన్ని పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి కలెక్టర్లు/జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్ల నుంచి నివేదికలు తెప్పించి గురువారం వాటిని పరిశీలించింది. ఎలక్ట్రానిక్ ఆధారాలతో పాటు ఇతర అన్ని సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకుంది. మైదుకూరు, రాజంపేట మున్సిపాలిటీలు, కడప, తిరుపతి కార్పొరేషన్లలోని 72 వార్డులు/ డివిజన్లకు మళ్లీ నామినేషన్లు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ స్థానాలకు గతంలో ప్రకటించిన నామినేషన్ కేంద్రాలతో పాటు అదనంగా జిల్లా కలెక్టరేట్ల ప్రాంగణాల్లోనూ నామినేషన్లు స్వీకరిస్తారు. మిగిలిన చోట్ల నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి మార్పులేదు.
తొలుత విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 21న అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ, 28న పోలింగ్, 29న రీపోలింగ్, 30న ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం 25న అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ, 1న పోలింగ్, 2న రీపోలింగ్, 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
సిరిమాను ఉత్సవం నేపథ్యంలో విజయనగరం నగరపాలక సంస్థకు అక్టోబరు 28న కాకుండా.. 29న పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ గతంలో ఆదేశాలిచ్చింది. షెడ్యూలు మారిన నేపథ్యంలో ఇక్కడ కూడా నవంబరు 1న పోలింగ్ నిర్వహించనున్నారు.