రెబల్స్‌ నామినేషన్లు ఉపసంహరించుకోవాలి

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..రెబల్స్‌ నామినేషన్లు ఉపసంహరించుకోవాలి

పార్టీ ఆదేశాలు ధిక్కరిస్తే చర్యలు తప్పవు.. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. రెబల్స్‌గా నామినేషన్లు దాఖలు చేసిన వారితో ఉపసంహరింపజేయాలని, పార్టీ అధికారికంగా ఎంపిక చేసిన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ ఆదేశాలను ధిక్కరించి స్వతంత్రంగా ముందుకెళ్లేవారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.

కూటమిలోని మూడు పార్టీలు పరస్పర సమన్వయంతో వ్యవహరిస్తూ, కేటాయించిన స్థానాల్లో సమర్థులైన అభ్యర్థులను బరిలో నిలపాలని చంద్రబాబు సూచించారు. అధికారిక అభ్యర్థులకు త్వరగా బీ-ఫారాలు అందించాలని, తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం అభ్యర్థుల ఎంపికలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ఇంటింటి ప్రచారం నిర్వహించి, ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను బూత్‌ స్థాయి వరకు ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు.

కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని, గత సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన 57 శాతం స్ట్రైక్‌ రేట్‌ కంటే ఎక్కువ విజయాలు నమోదు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా పార్టీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తానని, మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ కార్యకర్తల మాదిరిగా క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు.

ప్రజల్లో గుర్తింపు, ఆమోదం ఉన్నవారికే ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రామాల్లో సమర్థులైన నాయకులను ఎంపిక చేసుకుంటేనే పార్టీ మరింత బలోపేతమవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు స్థానిక ఎన్నికలు పదవులు కల్పించేందుకు మంచి అవకాశమని తెలిపారు. పొత్తులు, రాజకీయ సమీకరణాల కారణంగా సీట్లు కేటాయించలేని వారికి నామినేటెడ్‌ పదవుల్లో అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. 11 కార్పొరేషన్లను 11 సామాజికవర్గాలకు కేటాయించడం ద్వారా అన్ని వర్గాలకు రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కల్పించడమే లక్ష్యమని వివరించారు.

విలువలు లేకుండా, రౌడీయిజంతో, అధికార దుర్వినియోగంతో చేసే రాజకీయాలు ఎన్నటికీ నిలబడవని పేర్కొంటూ, నిరంతరం ప్రజలకు సేవ చేస్తూ వారి విశ్వాసాన్ని పొందినప్పుడే నాయకులుగా ఎదగగలరని చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీ పనితీరుకు పరీక్షగా అభివర్ణిస్తూ, కూటమి అభ్యర్థుల గెలుపు కోసం సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.