వికలాంగులకు ఆర్టిసి లో ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేయాలి

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..వికలాంగులకు ఆర్టిసి లో ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేయాలి

అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే మంత్రులను జిల్లాలో తీరగనివ్వం

మాజీ MLA నంద్యాల నర్సింహారెడ్డి

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని బస్సుల్లో వికలాంగుల పాసులు అనుమతించాలి

RTC షాపింగ్ కంప్లెక్స్లలో 5 శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలి

NPRD రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య

RTC లో వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలి

NPRD రాష్ట్ర అధ్యక్షులు కె వెంకట్

రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చినం హామీలను అమలు చేసే వరకు ఉద్యమం

బస్సు భవన్ ముందు ధర్నా.. ED గారికి వినతిపత్రం అందచేత.. స్పష్టమైన హామీతో ధర్నా విరమణ

సమస్యలు పరిష్కారం చేస్తాం.. ED హామీ

వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు RTC బస్సు భవన్ ముందు ధర్నా నిర్వహించి, RTC సంస్థ ED వెంకన్న గారికి వినతిపత్రం అందచేయడం జరిగింది
ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన నల్గొండ మాజీ MLA నంద్యాల నర్సింహారెడ్డి మాట్లాడుతూ సమాజంలో అత్యంత వెనకబడిన వికలాంగులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.వికలాంగులను పట్టించుకోని ప్రభుత్వం అధికారంలో ఉన్న ఒక్కటే లేకున్నా ఒక్కటేనని అన్నారు.వికలాంగులను సకలాంగులతో సమానంగా చేసే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు.ఓట్ల కోసం అమలు చేయలేని హామీలను ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న ముఖ్యమంత్రి,కొత్తగా వృద్ధులకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని నిర్ణయం చేసిన వికలాంగులకు ఎందుకు ఉచిత ప్రయాణం ఇవ్వాలని నిర్ణయం చేయడం లేదని అన్నారు. రాష్ట్రంలో సుమారుగా 10,174 ఆర్టిసి బస్సులు ఉన్నవి.వీటిల్లో వికలాంగుల కోసం ప్రత్యేకంగా సీట్స్ కేటాయించడం జరిగింది. కానీ గత 34 నెలల నుండి వికలాంగులకు కేటాయించిన సీట్స్ లలో వికలాంగులు కూర్చోవడానికి అవకాశం లేకుండా పోతుంది. దీని వలన వికలాంగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వికలాంగులకు కేటాయించిన సీట్లలో వికలాంగులే కూర్చునే విదంగా కింది స్థాయి వరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో సుమారుగా 364 బస్సు స్టేషన్స్ ఉన్నవి. వీటి పరిధిలో వందలాది షాపింగ్ కంప్లెక్స్లు ఉన్నవి. 2016 ఆర్ పి డి చట్టం ప్రకారం షాపింగ్ కాంప్లెక్స్ లలో షాప్స్ కేటాయించే దానిలో రిజర్వేషన్ అమలు చేయాలి.కానీ రాష్ట్రంలో షాప్స్ కేటాయించే దానిలో పూర్తి స్థాయిలో రిజర్వేషన్స్ అమలు కాకపోవడం వలన వికలాంగులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఆర్టిసి పరిధిలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లలో మొదటి ప్రాధాన్యతగా వికలాంగులకు షాప్స్ కేటాయించాలని డిమాండ్ చేశారు
NPRD రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 10,48,822మంది వికలాంగులు ఉన్నారని వీరిలో సగం మంది మహిళలు ఉన్నారనే విషయం ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు .ఇప్పటికే మహిళా వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు అవుతుందన్నారు .అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేస్తామని హామీ ఇచ్చి వికలాంగులను మోసం చేశారాని అన్నారు.కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 34 నెలలు అవుతున్న హామీ అమలు కాలేదన్నారు . ఉచిత ప్రయాణ సౌకర్యం లేకపోవడం వలన పురుష వికలాంగులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు . మహిళలతో పాటు పురుష వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
2016 వికలాంగుల హక్కుల చట్టం కొత్తగా 21 రకాల వైకల్యలను అధికారికంగా గుర్తించింది.కానీ ఆర్ టి సి యాజమాన్యం ఆంధత్వం, మూగ చెవిటి, శరీరక వికలాంగులు, మానసిక వికలాంగులు, లెప్రసీ, మరుగుజ్జు వైకల్యాలు కలిగిన వారికే పాసులు జారీ చేస్తుంది.2016 వికలాంగుల హక్కుల చట్టం గుర్తించిన 21 రకాల వైకల్యాలు కలిగిన వారికీ పాసులు జారీ చేయకపోవడం అంటే చట్టాన్ని ఉల్లంగించడమే అవుతుంది. చట్టం ప్రకారం 40 శాతం వైకల్యం కలిగిన వికలాంగులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అన్ని రకాల సంక్షేమ పథకాలు పొందెందుకు అర్హులు కానీ రాష్ట్రంలో ఆంధత్వం మరియు మూగ, చెవిటి వైకల్యం కలిగిన వారికి 100 శాతం వైకల్యం ఉంటేనే రాయితీ పాసులు జారీ చేస్తున్నారు.మూగ చెవిటి వాళ్ళు 51 శాతం వైకల్యం ఉంటే ప్రభుత్వ పథకాలకు అర్హులు. కానీ ఆర్ టి సి యాజమాన్యం మాత్రం 100 శాతం వైకల్యం ఉంటేనే బస్సు పాసులు జారీ చేయాలనే నిర్ణయం 2016 వికలాంగుల హక్కుల చట్టనికి పూర్తి విరుద్ధమైంది.మానసిక వికలాంగులకు ఐక్యూ 69 శాతం కంటే తక్కువగా ఉంటేనే పాసులు జారీ చేస్తున్నారు.21 రకాల వికలాంగులకు రాయితీ పాసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు
NPRD రాష్ట్ర అధ్యక్షులు కె వెంకట్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల ఆర్టిసి బస్సుల్లో వీల్ చైర్స్ ఉపయోగించే వికలాంగులు మరియు తీవ్ర వైకల్యం కలిగిన వారు బస్సు ఎక్కడానికి తీవ్రమైన ఇబ్బంది ఎదురుకోవాల్సి వస్తుంది. ఎలక్ట్రికల్ బస్సుల్లో మాత్రమే వీల్ చైర్స్ వెళ్ళడానికి అవకాశం ఉంది.మిగతా బస్సుల్లో అలాంటి అవకాశం లేదు.ఆర్టిసిలో ఉన్న అన్నిరకాల బస్సుల్లో లిఫ్ట్ సౌకర్యం లేదా ర్యాంపు సౌకర్యం ఏర్పాటు చేసే విదంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వికలాంగులకు 4 శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని 2016 వికలాంగుల హక్కుల చట్టం పేర్కొన్నది. కానీ ఆర్టిసి లో పూర్తి స్థాయిలో రిజర్వేషన్ అమలు కావడం లేదు.కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో వికలాంగులకు 4 శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని అన్నారు
NPRD రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేష్ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారుగా 3151 ఆర్ టి సి బస్సులు నడుస్తున్నవి. వీటిలో కేవలం ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే వికలాంగుల రాయితీ పాసులను అనుమతిఇస్తున్నారు .కానీ జిల్లా సర్వీస్లలో ఎక్ష్ప్రెస్స్ మరియు డీలాక్స్ బస్సుల్లో కూడా వికలాంగులకు రాయితీతో టికెట్స్ ఇస్తున్నారు. కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం అమలు కావడం లేదు. గ్రేటర్ పరిధిలో ఆర్డినరీ బస్సుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నందున పనుల కోసం ఎక్కడికైనా వెళ్ళాలనుకునే వికలాంగులకు తీవ్రమైన అసౌకర్యం కలుగుతుంది. గ్రేటర్ పరిధిలో నడిచే అన్ని బస్సుల్లో వికలాంగుల పాసులు అనుమతించాలని డిమాండ్ చేశారు.
వికలాంగులకు RTC లో సౌకర్యాలు కల్పిస్తాం. ED హామీ
రాష్ట్రంలో ఉన్న వికలాంగులకు RTC లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని RTC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకన్న హామీ ఇచ్చారు. గ్రేటర్ పరిధిలో అన్ని బస్సుల్లో వికలాంగుల పాసులు అనుమతి కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. షాపింగ్ కంప్లెక్స్ లలో రిజర్వేషన్ అమలు కృషి చేస్తామని అన్నారు. బస్సుల్లో వికలాంగులకు కేటాయించిన సీట్స్లలో వారే కూర్చునే విదంగా డిపో మేనేజర్ లకు ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.వీల్ చైర్ వినియోగించే వికలాంగుల కోసం ప్రత్యేకంగా లిఫ్ట్ సౌకర్యం కల్పించడానికి చర్యలు తుసుకుంటున్నామని హామీ ఇచ్చారు. బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీతో పాటు 4 శాతం రిజర్వేషన్స్ అమలు చేయడానికి ప్రభుత్వం ద్రుష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బి స్వామి, ఉపేందర్, సహాయ కార్యదర్శులు జె రాజు,కాశప్ప,గంగాధర్, బాలిశ్వర్ రాష్ట్ర కమిటీ సభ్యులు శశికల, భుజంగారెడ్డి, ప్రకాష్, బాబు, బంగారయ్య, నర్సింహా, భాగ్యలక్ష్మి, లలిత, జయలక్ష్మి, చంద్రమోహన్, బాలయ్య, విజయ్, రాజు, యాదయ్య, సంగప్ప లతో పాటు వివిధ జిల్లాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

యం అడివయ్య
ప్రధాన కార్యదర్శి