అఖండ విజయం సాధించేందుకు సమిష్టిగా కృషి చేయాలి

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..అఖండ విజయం సాధించేందుకు సమిష్టిగా కృషి చేయాలి

-అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

జనసేనలో భారీగా చేరికలు

జనసేనలో చేరిన మాచవరం వైసీపీ నాయకులు

స్వాగతం పలికిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, మండలి వెంకట్రామ్

అవనిగడ్డ:

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి అభ్యర్థులకు ఏయే స్థానాలు నిర్ధారిస్తే ఆయా స్థానాల్లో అఖండ విజయం సాధించేందుకు సమిష్టిగా కృషి చేయాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. వైసీపీ నుంచి జనసేన పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. బుధవారం సాయంత్రం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. కోడూరు మండలం మాచవరం జనసేన పార్టీ నాయకులు రెడ్రౌతు కృష్ణబాబు, కూరాకుల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జనసేన పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ పార్టీ కండువాలతో స్వాగతం పలికారు. వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరిన వారిలో విస్సంశెట్టి గంగారావు, విస్సంశెట్టి పున్నారావు, కూరాకుల సుబ్బారావు, కూరాకుల శివరామకృష్ణ, కోట ఆదిశేషు, జరుగు రామాంజనేయులు, నల్లూరి రమేష్, కూరాకుల ఆంజనేయులు, నల్లూరి వెంకటేశ్వరరావు, కూరాకుల మధు, నల్లూరి రామాంజనేయులు, నల్లూరి నాగ రమేష్ తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మాచవరంతో తనకు చిరకాలంగా అనుబంధం ఉందని, తనకు ప్రతినిత్యం ఈ గ్రామం అండగా నిలిచిందన్నారు. కూటమి బలోపేతానికి, పవన్ కళ్యాణ్ ఆశయాలు గ్రామాలు అభివృద్ధి పథంలో నడుపుతున్న తీరు గమనించి మాచవరం గ్రామ వైసీపీ నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరటం సంతోషదాయకం అన్నారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ, బిజెపిలను కలిపి కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారన్నారు. వైసిపి అరాచక పాలన అంతమొందించిన ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, పల్లెల ప్రగతికి కీలకంగా నిలిచే పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖను ఎంచుకున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ పాలనలో అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక వ్యవస్థ కారణంగా అభివృద్ధికి నోచుకోని అనేక రహదారుల అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు సాధించి తెస్తున్నారన్నారు. తద్వారా అవనిగడ్డ నియోజకవర్గంలో ఇప్పటికే విస్తృత సంఖ్యలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా ప్రధాన, గ్రామీణ రహదారుల నిర్మాణం సాకారం చేసినట్లు తెలిపారు. పల్లెల ప్రగతికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషిని గ్రామీణ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారన్నారు. వైసీపీ హయాంలో అధ్వానంగా మారిన కోడూరు రోడ్డు కారణంగా ఈ గ్రామాల ప్రజలందరూ తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారన్నారు. ఈ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషితో గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని, వాస్తవ పరిస్థితిని గమనించి జనసేనకు అండగా నిలవాలని మాచవరం గ్రామ వైసీపీ నాయకులు ఆ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరడం శుభ పరిణామం అన్నారు. మాచవరం గ్రామంలో గత టీడీపీ ప్రభుత్వంలోనూ, ఈ ప్రభుత్వంలోనూ అనేక సీసీ రోడ్లు నిర్మించామని మరిన్ని సీసీ రహదారులు నిర్మిస్తామన్నారు. పవన్ కళ్యాణ్ సహకారంతో డొంక రోడ్లు కూడా నిర్మిస్తామని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి అభ్యర్థులకు ఏయే స్థానాలు నిర్ధారిస్తే ఆయా స్థానాల్లో అఖండ విజయం సాధించేందుకు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తద్వారా గ్రామాల అభివృద్ధికి చేయి చేయి కలిపి ముందుకు సాగాలన్నారు. గతంలో ఉన్న బేధాభిప్రాయాలు పక్కనపెట్టి ముందుకు సాగి మాచవరంలో అజేయ శక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ జరుగు ఆదినారాయణ, జనసేన పార్టీ నాయకులు జరుగు పోతురాజు, జరుగు లక్ష్మణ, అరజా నగరాయలు తదితరులు పాల్గొన్నారు.