హోంగార్డు ఉద్యోగాల పేరుతో రూ.6.95 లక్షల వసూలు కేసు.. నిందితుడి అరెస్ట్

భారత్ డిజిటల్ న్యూస్ తిరుపతి..హోంగార్డు ఉద్యోగాల పేరుతో రూ.6.95 లక్షల వసూలు కేసు.. నిందితుడి అరెస్ట్.

  • హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదు.
  • ఇద్దరు బాధితుల నుంచి మొత్తం రూ.6,95,000/- స్వీకరించినట్లు ఆరోపణలు.
  • నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేసినట్లు ఫిర్యాదు.
  • నిందితుడు సుమారు ఏడాది కాలంగా హోంగార్డ్ విధులకు గైర్హాజరు.
  • నిందితుడిని అరెస్ట్ చేసిన అలిపిరి పోలీసులు.

తిరుపతి, అక్టోబర్ 05: తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదుపై అలిపిరి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నెల్లూరు జిల్లా చేజర్ల మండలం మడపల్లి గ్రామానికి చెందిన గుండుబోయన నరేష్ (31), తాను నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డుగా పనిచేస్తున్నానని పరిచయం చేసుకుని, డి. లోకేష్ మరియు ఎన్. సత్తిలకు హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఉద్యోగ ఖర్చుల పేరుతో లోకేష్ నుంచి రూ.4,95,000/-, సత్తి నుంచి రూ.2,00,000/- బ్యాంకు ఖాతాల ద్వారా స్వీకరించి, అనంతరం నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై లోకేష్ 02-10-2026న అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పోలీసుల దర్యాప్తులో నిందితుడు నరేష్ ప్రస్తుతం సుమారు ఒక సంవత్సరం కాలంగా నెల్లూరు హోంగార్డ్ యూనిట్‌లో విధులకు గైర్హాజరుగా (ఆబ్సెంట్‌గా) ఉన్నట్లు వెల్లడైంది.

దర్యాప్తులో లభించిన సమాచారం ఆధారంగా 05-10-2026 ఉదయం ఎస్వీఆర్‌ఆర్‌జీజీ హాస్పిటల్ జంక్షన్ వద్ద నిందితుడు గుండుబోయన నరేష్‌ను అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకుని, చట్టప్రకారం అరెస్ట్ చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

పోలీసుల దర్యాప్తులో నిందితుడికి సంబంధించి గతంలోనూ ఉద్యోగాల పేరుతో డబ్బులు స్వీకరించినట్లు ఆరోపణలు ఉన్న కేసుల వివరాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు.

  • మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి నుంచి రూ.7,00,000/- స్వీకరించినట్లు ఫిర్యాదు రావడంతో, అనంతరం ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించినట్లు పోలీసులు తెలిపారు.
  • బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్యోగాల పేరుతో రూ.17,50,000/- స్వీకరించినట్లు నమోదైన కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉన్నట్లు తెలిపారు.
  • ప్రజలకు పోలీసుల సూచన.

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వ్యక్తులు లేదా మధ్యవర్తులను నమ్మి డబ్బులు చెల్లించవద్దని జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., సూచించారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారిక నోటిఫికేషన్లు, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారిక వెబ్‌సైట్ల ద్వారా మాత్రమే నిర్ధారించుకోవాలని తెలిపారు.

ఇలాంటి ఉద్యోగ మోసాలకు సంబంధించిన సమాచారం ఉంటే డయల్ 112 కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు వెంటనే సమాచారం అందించాలని సూచించారు.