భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..మిలటరీ ఆయుధాల చోరీ కేసు ఛేదన.. 8 మంది అరెస్ట్
హైదరాబాద్: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బొల్లారం పోలీస్ స్టేషన్లో నమోదైన ఆర్మ్స్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఆర్మీకి చెందిన అత్యాధునిక తుపాకులు, పిస్టల్స్, భారీగా మందుగుండు సామగ్రిని చోరీ చేసిన కేసులో మొత్తం 8 మంది నిందితులను గుర్తించినట్లు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ తెలిపారు.
ఆగస్టు 31న చోరీ..
బొల్లారంలోని 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్‌లోని కోటే, మ్యాగజైన్ తాళాలు పగులగొట్టి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి చోరీకి గురయ్యాయి. చోరీకి గురైన వాటిలో 4 AK-203 రైఫిళ్లు, ఒక INSAS రైఫిల్, 6 9ఎంఎం పిస్టల్స్, ఒక సివిల్ పిస్టల్, 3 బైనాక్యులర్లు ఉన్నాయి.
అలాగే 1,156 పిస్టల్ రౌండ్లు, 720 AK-203 రౌండ్లు, 36 INSAS రౌండ్లు కూడా చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు.
మాజీ ఆర్మీ ఉద్యోగి ప్రధాన నిందితుడు..
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన ఉప్పుతొళ్ల మల్లేశ్ @ రాజు (37) గతంలో 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్‌లో హవల్దార్‌గా పనిచేసి రిటైర్ అయ్యాడు. ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న తన బంధువు, స్నేహితులతో కలిసి బ్యాంకులు, నగల దుకాణాలు, సంపన్నులను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడేందుకు ఆయుధాలను చోరీ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
చోరీ చేసిన ఆయుధాలను పశ్చిమ బెంగాల్‌కు చెందిన అవి డే @ ఒబి, బిర్బల్ షాలకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు.
సహకరించిన మాజీ సహచరులు..
ప్రధాన నిందితుడు గతంలో తనతో కలిసి పనిచేసిన శేషులు, వినోద్ కుమార్, ప్రవీణ్ సహకారంతో ఆర్మీ కోటే, మ్యాగజైన్ తాళాలు పగులగొట్టి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని చోరీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

అనంతరం చోరీ చేసిన ఆయుధాలను ఉపయోగించి భారీ దోపిడీలు చేయాలని నిందితులు ప్రణాళిక వేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.
2022లోనే అక్రమ ఆయుధం కొనుగోలు..
దర్యాప్తులో మరో విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ప్రధాన నిందితుడు 2022లో పశ్చిమ బెంగాల్‌లోని బారక్పూర్లో ఉన్న సమయంలో అవి డే @ ఒబి ద్వారా రూ.10 వేలకే ఒక దేశీయ తుపాకీ, ఒక లైవ్ రౌండ్ కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆ ఆయుధాన్ని నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని తన తండ్రి ఇంట్లో దాచిపెట్టినట్లు గుర్తించారు. సెప్టెంబర్ 23న పోలీసులు ఆ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.
భారీగా ఆయుధాలు స్వాధీనం..
పోలీసులు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న వాటిలో:
🔹 4 AK-203 రైఫిళ్లు, 5 మ్యాగజైన్లు
🔹 1 INSAS రైఫిల్, 3 మ్యాగజైన్లు
🔹 6 9ఎంఎం ఆటోమేటిక్ పిస్టల్స్, 12 మ్యాగజైన్లు
🔹 1 సివిల్ 6.35 బోర్ పిస్టల్, మ్యాగజైన్
🔹 3 బైనాక్యులర్లు
🔹 1,156 పిస్టల్ రౌండ్లు
🔹 720 AK-203 రౌండ్లు
🔹 36 INSAS రౌండ్లు
🔹 5 మొబైల్ ఫోన్లు
8 మంది అరెస్ట్
ఈ కేసులో ప్రధాన నిందితుడు మల్లేశ్‌ను సెప్టెంబర్ 11న అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది. అనంతరం పోలీస్ కస్టడీలో విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
మిగిలిన A2 నుంచి A8 వరకు ఏడుగురు నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేసి, అక్టోబర్ 3న కోర్టులో హాజరుపరుస్తున్నట్లు వెల్లడించారు.
పోలీసుల ప్రకారం.. ఈ ఘటన వెనుక టెర్రరిస్ట్ లేదా తీవ్రవాద సంబంధాలు ఉన్నట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు గుర్తించలేదు. భారీగా ఆస్తుల దోపిడీలకు పాల్పడాలనే ఉద్దేశంతోనే నిందితులు ఈ ఆయుధాల చోరీకి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.
— బి. సుమతి, ఐపీఎస్
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్