భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…టీటీడీ చైర్మన్ రేసులో సినీ ప్రముఖులు.. ! తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి రద్దయింది. ప్రస్తుతం స్పెసిఫైడ్ అధారిటీ అధికారుల పర్యవేక్షణ, పాలనలోనే తిరుమల కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.ఇక, ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో పాలక మండలిని కొత్తగా తీర్చిదిద్దడం సాధ్యం కాదని ప్రభుత్వం తేల్చేసింది. డిసెంబరు 3న గ్రామ పంచాయతీ ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత కానీ.. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ పూర్తిగా ఎత్తే యడం సాధ్యం కాదు. దీంతో అప్పటి వరకు టీటీడీ బోర్డును కూడా ఏర్పాటు చేయలేరు.
ఇదిలావుంటే.. ప్రస్తుతం చైర్మన్ రేసులో అనేక మంది రాజకీయ ప్రముఖుల తో పాటు.. ఆర్ ఎస్ ఎస్ నుంచి డిమాండ్లు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఓ ఎన్నారై ఈ రేసులో ముందున్నారన్న వాదనా వినిపిస్తోంది. ఇక, మరోవైపు సినీ రంగానికి చెందిన ముగ్గురు ప్రముఖులు కూడా చైర్మన్ రేసులోకి వచ్చారని టీడీపీలో అత్యంత విశ్వసనీయ నాయకుడి ద్వారా తెలిసింది. ఈ ముగ్గురు కూడా.. ఒకే సామాజిక వర్గానికి చెందినవారని.. పైగా చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తులు.. విధేయులని కూడా ఆ నాయకుడు తెలిపారు.వీరిలో దర్శకుడు రాఘవేంద్రరావు పేరు ముందుందని చెబుతున్నారు. గతంలో 2014-19 మధ్య టీడీపీ హయాంలో ఇదే తిరుమలకు చెందిన ఎస్వీబీసీ చానెల్‌కు ఆయన చైర్మన్‌గా చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చే వరకు అంటే.. సుమారు నాలుగు సంవత్సరాలు ఆయన ఈ పదవిలో ఉన్నారు.ఇక, ఇప్పుడు నేరుగా బోర్డు చైర్మన్ పోస్టును ఆశిస్తున్నట్టు సదరు నేత చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే చంద్రబాబుకు సమాచారం ఇచ్చారని.. ఒకటి రెండు సార్లు ఫోన్లు కూడా చేసినట్టు సమాచారం ఉందన్నారు.

ఇక, ఈ జాబితాలో రెండో వ్యక్తి ప్రముఖ నిర్మాత సీ. అశ్వనీదత్ అంటున్నారు. గతంలో టీడీపీ కండువా కప్పుకొన్న దత్.. విజయవాడ ఎంపీగా టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయన కూడా చివరి అవకాశంగా తనకు టీటీడీ బోర్డు చైర్మన్ కావాలని కోరుతున్నట్టు సమాచారం. పార్టీ పరంగా ఆయన యాక్టివ్‌గా లేకపోయినా.. తరచుగా ఏపీ రాజకీయాలపై తన అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో ఐటీ ఎంప్లాయీస్ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు.ఇక, ఈ జాబితాలో మూడో వ్యక్తి.. మాజీ ఎంపీ, నటుడు, వ్యాపార వేత్త మురళీమోహన్. గతంలో టీడీపీ తరఫున రాజమండ్రి ఎంపీగా పనిచేశారు. తన కోడలిని కూడా ఎన్నికల వేళ పార్టీ తరఫున పరిచయం చేశారు. కారణాలు ఏవైనా.. గత ఎన్నికలకు ముందు ఆయన తప్పుకొన్నారు. అప్పట్లో అనారోగ్యం బారిన పడ్డారు. చంద్రబాబు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పలకరించారు. ఇక, ఇప్పుడు ఆయన కూడా టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని కోరుతున్నట్టు టీడీపీముఖ్య నాయకుడు ఒకరు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.