వరద ప్రవాహాలపై నిరంతర నిఘా

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.ప్రజల భద్రతే తొలి ప్రాధాన్యత.. అప్రమత్తంగా ఉండండి

వర్షాలు, వరదలపై అధికార యంత్రాంగం నిరంతర పర్యవేక్షణ చేయాలి

మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు.. మున్నేరు తీర ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలాలి

పశువులను కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలి: ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు..

నందిగామ, సెప్టెంబర్ 24: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నందిగామ నియోజకవర్గ ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు పిలుపునిచ్చారు. ప్రజల ప్రాణ భద్రత, యోగక్షేమాలే తనకు తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.

గురువారం నందిగామ పట్టణం కాకాని నగర్‌లోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. ఇప్పటికే అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించినట్లు తెలిపారు.

వరద ప్రవాహాలపై నిరంతర నిఘా

వర్షాల కారణంగా వాగులు, వంకలు, నదుల్లో వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. మున్నేరు నది పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని, పరిస్థితి తీవ్రతరం అయితే ఆలస్యం చేయకుండా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కోరారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం, అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు

తుఫాను ప్రభావం, భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లకుండా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని తంగిరాల సౌమ్య గారు సూచించారు. మున్నేరు నది తీర ప్రాంత ప్రజలు వరద పరిస్థితులను నిరంతరం గమనిస్తూ, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.

ప్రజలతో పాటు పశువుల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకోవాలని, ప్రమాదకర ప్రాంతాల్లో ఉన్న పశువులను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.

ప్రజల కోసం అందుబాటులో అత్యవసర నంబర్లు

విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రజలు సంబంధిత అధికారులను సంప్రదించాలని ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు తెలిపారు.

  • నందిగామ ఆర్డీవో: 9154970459
  • నందిగామ ఎమ్మార్వో: 9849903994
  • నందిగామ మున్సిపల్ కమిషనర్: 9491496856
  • చందర్లపాడు ఎమ్మార్వో: 9849903987
  • కంచికచర్ల ఎమ్మార్వో: 9849903995
  • వీరులపాడు ఎమ్మార్వో: 9515207587

“ప్రజల కష్టాల్లో అండగా ఉంటాం.. ప్రతి ఒక్కరి భద్రత కోసం ప్రభుత్వం, అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రజలు అధైర్యపడకుండా అధికారుల సూచనలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలి” అని తంగిరాల సౌమ్య గారు విజ్ఞప్తి చేశారు.