గంటకు 120 కిలోమీటర్ల కు కన్నా ఎక్కువ వేగంతో వీచిన గాలులు.

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..అమరావతి

గంటకు 120 కిలోమీటర్ల కు కన్నా ఎక్కువ వేగంతో వీచిన గాలులు… 20 జిల్లాలను వణికించిన ‘అర్నబ్’, ‘మురసు’ జంట తుపానులు. ఒకే వారంలో విరుచుకుపడిన తీవ్ర తుపాలను ఏపీ ప్రభుత్వం ఎదుర్కొన్న తీరు దేశానికే ఆదర్శంగా నిలిచింది. ప్రకృతి సృష్టించిన బీభత్సం ఎంత పెద్దదైనా, ప్రభుత్వ దార్శనికత, ముందస్తు వ్యూహాల ముందు అది చిన్నబోక తప్పలేదు. ఆపద సమయంలో సకాలంలో స్పందించి, ఆస్తి-ప్రాణ నష్టాన్ని సమర్థవంతంగా నివారించి రాష్ట్రాన్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది.

గౌరవ ముఖ్యమంత్రి గారి సాంకేతిక విజ్ఞత, సుదీర్ఘ అనుభవం, అసమాన అంకితభావమే అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రజలకు పూర్తి రక్షణ కల్పిస్తూ, ఆంధ్రప్రదేశ్ నేడు సురక్షితమైన నాయకత్వంలో ఉందనే విషయాన్ని పునరుద్ఘాటించింది. మంత్రుల శాఖలవారీ నిరంతర పరిశీలన, ప్రత్యేక కార్యదర్శులు, ఐఏఎస్ అధికారుల కచ్చితమైన ముందస్తు ప్రణాళికలు, క్షేత్రస్థాయిలో వేలాది మంది ప్రభుత్వ సిబ్బంది అహర్నిశలు చేసిన సమష్టి కృషి ఫలితంగానే ఇది సాధ్యమైంది.

తీవ్ర తుపానుల ధాటి నుంచి ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) , రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) ప్రాణరక్షణ కవచాల్లా రక్షణగా నిలిచాయి. ముందస్తు ప్రణాళిక, ‘మనమిత్ర’ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం మరియు సమగ్ర సన్నద్ధత ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలను త్వరితగతిన సమన్వయం చేస్తూ ఆస్తి, ప్రాణ నష్టాలను కనిష్ట స్థాయికి తగ్గించడంలో ఈ రెండు సంస్థలు అత్యంత కీలక పాత్రను పోషించాయి.
ఆర్టీజిఎస్ (RTGS), విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) కంట్రోల్ రూమ్ కేంద్రంగా 24/7 పర్యవేక్షణ చేపట్టి, ‘అర్నబ్’, ‘మురసు’ తుఫానుల తీవ్రతను, తీరం దాటే కచ్చితమైన ప్రాంతాలను ముందే అంచనా వేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ సమాచారాన్ని ఉపయోగించి ప్రభావిత జిల్లాల ప్రజల మొబైల్ ఫోన్లకు హెచ్చరిక అలర్ట్‌లను పంపడం ద్వారా, క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని, ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయగలిగారు.

NDRF, SDRF, పోలీసు, విద్యుత్, రెవెన్యూ, ఇతర శాఖల మధ్య RTGS – APSDMA కల్పించిన సమగ్ర సమన్వయం ఫలితాన్నిచ్చింది. తుపాను తీరం దాటే సమయంలోనే రహదారులపై పడిన చెట్లు, స్తంభాలను తొలగించి, నిలిచిపోయిన రాకపోకలను రికార్డు వ్యవధిలో పునరుద్ధరించి జనజీవనాన్ని వేగంగా సాధారణ స్థితికి తీసుకొచ్చారు.

‘మనమిత్ర’ వాట్సప్ అప్లికేషన్, విపత్తు నిర్వహణ సంస్థ టోల్ ఫ్రీ నంబర్లకు ప్రజల నుంచి అందిన ఫిర్యాదులు, విజ్ఞప్తులపై అధికారులు తక్షణమే స్పందించారు. ప్రజలు ఎదుర్కొన్న సమస్యలకు సత్వర పరిష్కారాలు చూపుతూ, సహాయక చర్యలను వేగవంతంగా అందించి ప్రజలకు అండగా నిలిచారు.

ముందస్తు చర్యల్లో భాగంగా NDRF, SDRF, పోలీస్, ఫైర్, రెవెన్యూ సిబ్బంది లక్షలాది మందిని సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించారు. అక్కడ బాధితులకు అవసరమైన ఆహారం, తాగునీరు మరియు వైద్య వసతులను నిరంతరాయంగా అందించడంలో ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేశాయి.

ప్రభుత్వ పట్టుదల, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం యొక్క సరైన వినియోగం, ఆర్టీజిఎస్, విపత్తు నిర్వహణ సంస్థల సిబ్బంది అంకితభావం కారణంగానే ఈ రెండు తుఫానులను విజయవంతంగా తిప్పికొట్టగలిగింది. విపత్తు నిర్వహణలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని అర్నబ్ తుపాను పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం సైతం అభిప్రాయపడింది.