భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ….ముద్ర రుణ పథకానికి కేంద్రం గుడ్‌న్యూస్.. మరో ఐదేళ్లు కొనసాగింపు!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధానమంత్రి ముద్ర యోజన (PMMY) రుణాలకు సంబంధించిన క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ (CGFMU) పథకాన్ని మరో ఐదేళ్లపాటు కొనసాగించేందుకు ఆమోదం తెలిపింది. 2031 మార్చి 31 వరకు ఈ పథకం అమల్లో ఉండనుంది.
ముఖ్యమైన వివరాలు:
- అర్హత కలిగిన సూక్ష్మ సంస్థలకు ముద్ర పథకం కింద రూ.20 లక్షల వరకు రుణాలకు గ్యారెంటీ కవరేజీ.
- రూ.5,000 కోట్ల కార్పస్‌తో రూ.12.6 లక్షల కోట్ల రుణాలకు తోడ్పాటు.
- జనధన్ ఖాతాలపై బ్యాంకులు ఇచ్చే రూ.10,000 వరకు ఓవర్‌డ్రాఫ్ట్‌లకు గ్యారెంటీ.
- స్వయం సహాయక సంఘాల (SHG) రుణాలకు కూడా గ్యారెంటీ కవరేజీ.
- గ్యారెంటీ ఫీజును ఏడాదికి 1 శాతం నుంచి 0.75 శాతానికి తగ్గింపు.
- 2026-27 నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరాల వరకు ఈ పథకం వర్తింపు.

ఇప్పటివరకు భారీగా రుణాలు పంపిణీ!
2026 సెప్టెంబర్ నాటికి ప్రధానమంత్రి ముద్ర యోజన ప్రారంభమైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా 60.36 కోట్లకు పైగా రుణాలు మంజూరయ్యాయి. వీటి మొత్తం విలువ రూ.43.34 లక్షల కోట్లు.
చిన్న వ్యాపారులకు ప్రయోజనం!
ఈ నిర్ణయంతో చిన్న వ్యాపారులు, యువ పారిశ్రామికవేత్తలు, స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి రుణ సదుపాయాలు మరింత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పూచీకత్తు లేకుండా రుణాలు పొందేందుకు ఈ పథకం దోహదపడనుంది.