భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..వెయ్యి గ్రామాల మైలురాయిని దాటిన సమగ్ర భూ రీ-సర్వే
🔸 భూ యజమానుల ప్రయోజనాలే సర్వేలో అత్యంత ప్రాధాన్యత
🔸 రెవెన్యూ రికార్డుల ఆధారంగానే సర్వే ప్రక్రియ
🔸 సర్వే అనంతరం భూ యజమానులకు నోటీసులు జారీ చేసి అభ్యంతరాల స్వీకరణకు అవకాశం కల్పించాలి
🔸 రైతులకు సర్వే ప్రక్రియ, అభ్యంతరాల నమోదు, పరిష్కారంపై విస్తృత అవగాహన కల్పించాలి
🔸 చిన్న పొరపాటు కూడా భవిష్యత్తులో భూ వివాదానికి కారణం కాకూడదు
🔸 తరతరాలుగా పరిష్కారం కాని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి
తరతరాలుగా కొనసాగుతున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు ప్రతి భూ యజమానికి తన భూమిపై స్పష్టమైన హక్కులు, కచ్చితమైన సరిహద్దులు కల్పించడమే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ రీసర్వేను అత్యంత పారదర్శకంగా, శాస్త్రీయంగా, పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియలో భూ యజమానుల ప్రయోజనాలు, వారి అభిప్రాయాలు, మనోభావాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న భూ సర్వే పురోగతిపై మంగళవారం సచివాలయంలో రెవెన్యూ ఉన్నతాధికారులతో మంత్రి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, రైతుల నుంచి వస్తున్న స్పందన, సాంకేతిక అంశాలు, సర్వేలో పాల్గొంటున్న సిబ్బందికి ఎదురవుతున్న పరిస్థితులపై సమగ్రంగా చర్చించారు. సర్వే ప్రక్రియలో పాల్గొంటున్న సిబ్బందితో స్వయంగా ఫోన్లో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,954 రెవెన్యూ గ్రామాలు ఉండగా, తొలి దశలో హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల్లో జిల్లాకు 70 గ్రామాల చొప్పున ఎంపిక చేసి, నక్షాలు అందుబాటులో లేని గ్రామాలను కూడా కలుపుకొని మొత్తం 2,720 గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.ఇప్పటివరకు వెయ్యి గ్రామాల్లో రీసర్వే మైలురాయిని దాటగా, 416 గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు.

125 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అధికారులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు.సర్వే ప్రక్రియను మరింత వేగవంతం చేయడంతో పాటు నాణ్యత, పారదర్శకత, కచ్చితత్వం విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని మంత్రి అధికారులకు సూచించారు.
రెవెన్యూ రికార్డుల ఆధారంగానే సర్వే ప్రారంభించాలి:
గ్రామాల్లో భూ సర్వే ప్రారంభించడానికి ముందుగా ఆ గ్రామానికి సంబంధించిన రెవెన్యూ రికార్డులను పూర్తిస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలి, రికార్డుల్లో ఉన్న వివరాలు, భూముల విస్తీర్ణం, హక్కులు, సరిహద్దులను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే వాటి ఆధారంగా క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియను ప్రారంభించాలి.
సర్వే అనంతరం భూ యజమానులకు నోటీసులు జారీ చేయాలి:
సర్వే పూర్తయిన అనంతరం సంబంధిత భూ యజమానులకు తప్పనిసరిగా నోటీసులు జారీ చేయాలి. సర్వేలో నమోదైన వివరాలను పరిశీలించుకునేందుకు, ఏవైనా అభ్యంతరాలు లేదా అభిప్రాయాలు ఉంటే తెలియజేసేందుకు వారికి తగిన అవకాశం కల్పించాలి, భూ యజమానుల అభ్యంతరాలను స్వీకరించి, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం పరిష్కరించాలి.