ఆర్వోలు, ఏఆర్వోలకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజి సూచనలు

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..ఆర్వోలు, ఏఆర్వోలకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజి సూచనలు

కృష్ణా విశ్వవిద్యాలయం/మచిలీపట్నం: నవంబర్ 12, 2026

రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలు–2026 నిర్వహణలో భాగంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. నామినేషన్ల స్వీకరణ నుంచి పరిశీలన, ఉపసంహరణ, పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రచురణ, పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశలో ఎన్నికల నిబంధనలను తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు.

గురువారం కృష్ణా విశ్వవిద్యాలయంలోని అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో మచిలీపట్నం డివిజన్ పరిధిలోని రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు), సహాయ రిటర్నింగ్ అధికారులకు (ఏఆర్వోలు) నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని ఎన్నికల నిర్వహణకు సంబంధించి పలు కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అత్యంత కీలకమైన ప్రక్రియ అని, నోటిఫికేషన్‌లో నామినేషన్లు స్వీకరించే ప్రదేశం, తేదీలు, సమయాలు తదితర వివరాలను స్పష్టంగా, తప్పులు లేకుండా పొందుపరచాలన్నారు. ఒక ఆర్వో పరిధిలో మూడు గ్రామపంచాయతీలు ఉన్నట్లయితే, నామినేషన్లు ఒక గ్రామపంచాయతీలో స్వీకరించినప్పటికీ, సంబంధిత ఎన్నికల నోటీసును మూడు గ్రామపంచాయతీల్లోనూ మూడు ముఖ్యమైన ప్రదేశాల్లో ప్రచురించాలని సూచించారు. అయితే నామినేషన్లు స్వీకరించే ప్రదేశం వివరాలు అన్ని చోట్లా ఒకే విధంగా, కచ్చితంగా ఉండాలని స్పష్టం చేశారు.

నామినేషన్ల స్వీకరణ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాలన్నారు. చివరి రోజు సాయంత్రం 5 గంటలలోపు వచ్చిన ప్రతి అభ్యర్థి నుంచి నామినేషన్ స్వీకరించాలన్నారు. ఇందుకోసం ప్రతి నామినేషన్ గదిలో డిజిటల్ గడియారాన్ని ఏర్పాటు చేయాలని, చివరి రోజు నామినేషన్ల స్వీకరణ ముగింపు సమయంలో గది తలుపులు మూసివేసే ప్రక్రియను వీడియో చిత్రీకరించాలని సూచించారు. చివరి నిమిషాల్లో ఎక్కువ మంది అభ్యర్థులు వచ్చినా, సమయానికి వచ్చిన వారందరి నామినేషన్లను స్వీకరించి, ప్రాథమిక పరిశీలనను అనంతరం చేపట్టాలన్నారు.

ప్రతి నామినేషన్‌కు క్రమసంఖ్య కేటాయించడంతోపాటు స్వీకరించిన తేదీ, సమయాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలని, ఒకే పేరుతో ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉన్నప్పుడు నామినేషన్ల స్వీకరణ క్రమాన్ని ఆధారంగా చేసుకుని జాబితాను రూపొందించాల్సి ఉంటుందని గుర్తుచేశారు. అభ్యర్థి లేదా ప్రతిపాదకుడు నామినేషన్ సమర్పించేందుకు వచ్చినప్పుడు ముగ్గురికి మించి వ్యక్తులను అనుమతించరాదన్నారు. ఎన్నికల వ్యయ ప్రకటనపై అభ్యర్థి స్వయంగా ఆర్వో ఎదుట సంతకం చేయాలని, చెక్‌లిస్టులో ప్రతి పత్రం సమర్పించిన వివరాలు, లోటుపాట్లను స్పష్టంగా నమోదు చేసి అభ్యర్థికి అందించాలని చెప్పారు.

ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలు చేయవచ్చని, దీనిపై ఎలాంటి అపోహలు కల్పించరాదన్నారు. ఒకే అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ వార్డుల్లో పోటీ చేసిన సందర్భంలో ఉపసంహరణ నిబంధనలను జాగ్రత్తగా పరిశీలించాలని, ఒకే వార్డుకు ఒకటి కంటే ఎక్కువ నామినేషన్ సెట్లు సమర్పించడం వేరని, వేర్వేరు వార్డుల్లో పోటీ చేయడం వేరని వివరించారు. ఉపసంహరణ సమయంలో అభ్యర్థి స్వయంగా హాజరుకాకపోతే, కనీసం ఫోన్ ద్వారా అభ్యర్థితో మాట్లాడి ఉపసంహరణ నిర్ణయాన్ని నిర్ధారించుకోవాలని సూచించారు.