నకిలీ ఆధార్‌, పాన్‌తో భారతీయురాలిగా చలామణి.. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ దందా గుట్టురట్టు

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..నకిలీ ఆధార్‌, పాన్‌తో భారతీయురాలిగా చలామణి.. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ దందా గుట్టురట్టు

🔹 బంగ్లాదేశ్‌కు చెందిన 30 ఏళ్ల మహిళ ఆల్ఫా (పేరు మార్చారు) నకిలీ ఆధార్‌, పాన్ కార్డులతో భారతీయురాలిగా చలామణి అవుతున్నట్లు ఈగల్ ఫోర్స్ గుర్తించింది. జియా శ్యాంరావు పేరుతో నకిలీ గుర్తింపు పత్రాలు సృష్టించి, అదే పేరుతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఖాతా తెరిచినట్లు వెల్లడించింది.

🔹 2021 డిసెంబర్‌లో టూరిస్ట్ వీసాపై భారత్‌కు వచ్చిన ఆమె.. ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో పడటంతో వ్యభిచారంలోకి వెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నూర్ అనే వ్యక్తి ప్రలోభపెట్టగా, రాహుల్, జే, జేకే అనే బ్రోకర్ల ద్వారా హైదరాబాద్‌తో పాటు పలు నగరాల్లో కార్యకలాపాలు సాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నెలకు సుమారు రూ.75 వేల వరకు సంపాదించినట్లు సమాచారం.

🔹 2021లో హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శ్యాంరావుతో పరిచయం ఏర్పడి, 2022 నుంచి సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అతని భార్యకు విషయం తెలియడంతో దూరమైనట్లు, శ్యాంరావు బంగ్లాదేశ్‌కు వెళ్లి ఆమెను, ఆమె తల్లిదండ్రులను కలిసినట్లు దర్యాప్తులో పేర్కొన్నారు.

🔹 కస్టమర్ల ద్వారా సింథటిక్ డ్రగ్స్‌కు అలవాటుపడిన ఆల్ఫా.. గోవాకు చెందిన ఆకాష్‌ అనే సరఫరాదారుడి నుంచి డ్రగ్స్‌ తెప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. డెడ్‌డ్రాప్ పద్ధతిలో గోవా, హైదరాబాద్‌లో నిర్ణీత ప్రదేశాల్లో డ్రగ్స్‌ ఉంచి సరఫరా చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

🔹 క్రమంగా తన కస్టమర్లు, పరిచయస్తులకు కూడా డ్రగ్స్‌ విక్రయించినట్లు విచారణలో వెల్లడైంది. శ్యాంరావు కూడా డ్రగ్స్‌కు అలవాటుపడి వినియోగించడం ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

🔹 గోవా నుంచి డ్రగ్స్‌తో హైదరాబాద్‌కు వచ్చినట్లు సమాచారం అందడంతో ఈగల్ ఫోర్స్, సైబరాబాద్ పరిధిలోని రాయదుర్గం పోలీసులు షేక్‌పేట పోచమ్మ బస్తీలోని నివాసంపై దాడి చేశారు. ఈ తనిఖీల్లో ఒక గ్రాము సింథటిక్ డ్రగ్స్‌, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

🔹 ఆల్ఫాతో పాటు ఆమె సహజీవన భాగస్వామి శ్యాంరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 1261/2026 కింద కేసు నమోదు చేశారు. గోవాకు చెందిన డ్రగ్స్ సరఫరాదారు ఆకాష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

🔹 బంగ్లాదేశ్‌, ఇతర దేశాల యువతులను పేదరికం, నిరుద్యోగం పేరుతో వ్యభిచారంలోకి దించి ఆ తర్వాత డ్రగ్స్ రవాణా, విక్రయాలకు వినియోగిస్తున్న బ్రోకర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈగల్ ఫోర్స్ హెచ్చరించింది. డ్రగ్స్‌ సమాచారం కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1908, వాట్సాప్ 87126 71111కు సమాచారం ఇవ్వాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేసింది.