మహిళల నుంచి అక్రమంగా అండాల సేకరణ ఆరోపణలు., 5 ఫెర్టిలిటీ సెంటర్లకు మహిళా కమిషన్ నోటీసులు

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..మహిళల నుంచి అక్రమంగా అండాల సేకరణ ఆరోపణలు., 5 ఫెర్టిలిటీ సెంటర్లకు మహిళా కమిషన్ నోటీసులు

హైదరాబాద్ లో మహిళల నుంచి నిబంధనలకు విరుద్ధంగా అండాలను సేకరిస్తున్నారనే ఆరోపణలపై తెలంగాణ మహిళా కమిషన్ స్పందించింది. హైదరాబాద్‌లోని ఐదు ఫెర్టిలిటీ కేంద్రాలకు నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టింది. మహిళల అనుమతి లేకుండా అండాల సేకరణ జరుగుతోందా? వైద్యపరమైన భద్రతా నిబంధనలు పాటిస్తున్నారా? అనే అంశాలపై కమిషన్ ఆరా తీస్తోంది.

నోటీసులు అందుకున్న కేంద్రాల్లో ఇందిరా IVF, నర్మదా ఫెర్టిలిటీ సెంటర్, ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్, సద్గురు ART సెంటర్, పద్మజ ఫెర్టిలిటీ సెంటర్ ఉన్నాయి.

ఈ నేపథ్యంలో సోమవారం బుద్ధ భవన్‌లోని మహిళా కమిషన్ కార్యాలయంలో ఆయా కేంద్రాల మేనేజింగ్ డైరెక్టర్లు, మెడికల్ సూపరింటెండెంట్లు, కేంద్రాల ప్రతినిధులు విచారణకు హాజరయ్యారు. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద సమక్షంలో ఈ వ్యవహారంపై వివరణ కోరినట్లు సమాచారం.

అండాల దాతల నుంచి రాతపూర్వక సమ్మతి తీసుకున్నారా? అండాల సేకరణకు సంబంధించి చట్టం నిర్దేశించిన పరిమితులను పాటించారా? మహిళలకు అవసరమైన వైద్య పరీక్షలు, భద్రతా చర్యలు కల్పించారా? అనే అంశాలపై కమిషన్ ప్రధానంగా దృష్టి సారించింది.

అలాగే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (ART) చట్టం–2021 నిబంధనలు ఉల్లంఘించారా? మహిళల ఆరోగ్యం, గౌరవం, పునరుత్పత్తి హక్కులకు భంగం కలిగిందా? అనే అంశాలపై ఆధారాలను పరిశీలించనుంది.

ఈ వ్యవహారంలో సంబంధిత ఫెర్టిలిటీ కేంద్రాలు లిఖితపూర్వక వివరణలు, అవసరమైన రికార్డులు సమర్పించాల్సి ఉంది. విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా బాధ్యులపై తదుపరి చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ నిర్ణయించే అవకాశం ఉంది.

మహిళల ఆరోగ్యం, హక్కుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమనే సంకేతాలను ఈ విచారణ ద్వారా మహిళా కమిషన్ ఇచ్చింది. అయితే, ఆరోపణలు ఇంకా విచారణలోనే ఉన్నాయి. సంబంధిత కేంద్రాలపై నేరం నిర్ధారణ కాలేదు.