భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు..ఎన్నికలకు ముందే గ్రామాభివృద్ధికి భారీ ఆఫర్..
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ళ గ్రామంలో సర్పంచ్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. తనను సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎంపిక చేస్తే గ్రామాభివృద్ధి కోసం రూ.1.50 కోట్లు విరాళంగా ఇస్తానని మాజీ సర్పంచ్ దూడల నాగేశ్వరరావు కుమార్తె, ఎంబీబీఎస్ విద్యార్థిని విశ్వశ్రీ ప్రియ ప్రకటించారు.
ఇటీవల ఇదే గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ తోకల శ్రీనివాస్.. తనను ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి రూ.కోటి ఇస్తానని ప్రకటించారు. తాజాగా విశ్వశ్రీ ప్రియ అంతకంటే ఎక్కువగా రూ.1.50 కోట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
తన తండ్రి దూడల నాగేశ్వరరావు, తల్లి రత్నం గతంలో గ్రామ సర్పంచ్‌లుగా పనిచేసి అభివృద్ధికి కృషి చేశారని ఆమె తెలిపారు. వారి ఆశయాలను కొనసాగిస్తూ గ్రామానికి సేవ చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు.

మరో ఏడాదిలో ఎంబీబీఎస్ పూర్తి కానుందని, గ్రామ ప్రజలు అవకాశం కల్పిస్తే అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఒకవైపు రూ.కోటి.. మరోవైపు రూ.1.50 కోట్లు.. దుళ్ళ గ్రామ సర్పంచ్ ఎన్నిక ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది!