222.640 కిలోల గంజాయి స్వాధీనం గంజాయి అక్రమ రవాణాదారుడిపై PIT NDPS చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులు
( భారత్ డిజిటల్ న్యూస్ ) తిరుపతి, నవంబర్ 12: తిరుపతి జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలకు పాల్పడుతూ పలుమార్లు పోలీసులకు పట్టుబడినప్పటికీ తన నేర కార్యకలాపాలను కొనసాగిస్తున్న రౌడీషీటర్, గంజాయి అక్రమ రవాణాదారుడు కళ్లపల్లి నాగేంద్ర @ కీల (వయస్సు 40 సంవత్సరాలు), పుల్లంపేట మండలం, రంగంపల్లి వడ్డిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిపై ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు.
సదరు వ్యక్తిపై తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు మరియు కాకినాడ జిల్లాల పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో మొత్తం నాలుగు NDPS కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి వివరాలు ఇలా ఉన్నాయి.
- ఒబులవారిపల్లి పోలీస్ స్టేషన్ – 50 కిలోలు.
- చిట్వేల్ పోలీస్ స్టేషన్ – 50 కిలోలు.
- SEB కావలి పోలీస్ స్టేషన్ – 12 కిలోలు.
- గండేపల్లి పోలీస్ స్టేషన్ – 110.640 కిలోలు.
ఈ నాలుగు కేసుల్లో కలిపి మొత్తం 222.640 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది.

పోలీసుల దర్యాప్తులో సదరు వ్యక్తి తన సహచరులతో కలిసి గంజాయిని అక్రమంగా కొనుగోలు చేసి, నిల్వ ఉంచి, వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తూ విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకొని మాదకద్రవ్యాల విక్రయాలకు పాల్పడుతూ సమాజానికి, ప్రజారోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తున్నట్లు గుర్తించారు.
ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ గారి ప్రతిపాదన మేరకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.Rt.No.1986, తేదీ 11-11-2026 ద్వారా Prevention of Illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act, 1988 (PIT NDPS Act) సెక్షన్ 3(1) కింద సదరు వ్యక్తిపై నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అతడిని రేణిగుంట సబ్ డివిజన్ పోలీస్ వారు డియస్పి గారి పర్యవేక్షణలో రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించే చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా జిల్లా ఎప్సి శ్రీ ఎల్ సుబ్బరాయుడు ఐపిఎస్., గారు మాట్లాడుతూ, యువత భవిష్యత్తును నాశనం చేసే గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలపై తిరుపతి జిల్లా పోలీస్ శాఖ నిరంతరం నిఘా ఉంచిందని తెలిపారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకుండా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే పోలీసులకు లేదా డయల్ 112కు తెలియజేయాలని, సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.