భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..మిస్సింగ్ కేసు.. హత్యగా మారిన వైనం
దృశ్యం సినిమాను తలపిస్తున్న ఘటన..
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సోమనపల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో కాలిపోయిన స్థితిలో కుడుకల శ్రీనివాస్ మృతదేహం లభ్యమైంది.
నీల్వాయి గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఈ నెల 20న కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు నీల్వాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసుగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు.. తాజాగా ఈ ఘటన హత్యగా మారినట్లు ఆధారాలు లభించినట్లు సమాచారం.
ఈ కేసులో మృతుడి సొంత అన్నతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. హత్యకు ఉపయోగించినట్లు అనుమానిస్తున్న ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఘటన స్థలంలోనే వైద్య, పోలీసు అధికారులు సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహానికి అక్కడే దహన సంస్కారాలు నిర్వహించినట్లు సమాచారం.

మిస్సింగ్‌గా మొదలైన కేసు.. చివరకు హత్యగా తేలడం స్థానికంగా కలకలం రేపుతోంది.
అయితే ఈ హత్యకు అసలు కారణమేంటి? శ్రీనివాస్ హత్య వెనుక ఎవరెవరి పాత్ర ఉంది? అన్నదానిపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.